“ప్రకృతి వ్యవసాయ విధానంలో కలెక్టర్ కార్యాలయంలో న్యూట్రి గార్డెన్‌కు శ్రీకారం”

“ప్రకృతి వ్యవసాయ విధానంలో కలెక్టర్ కార్యాలయంలో న్యూట్రి గార్డెన్‌కు శ్రీకారం”
నరసరావుపేట, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఈ రోజు ఉదయం జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, ఐఏఎస్ న్యూట్రి గార్డెన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన స్థలంలో పెల్లెటైజేషన్ చేసిన పీఎండీఎస్ (Pre-Monsoon Dry Sowing) కింద సుమారు 30 రకాల విత్తనాలను విత్తారు. సోమవారం ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలు తదితర ప్రదేశాల్లో ఖాళీ స్థలాలు ఉన్నచోట ప్రకృతి వ్యవసాయ విధానంలో న్యూట్రి గార్డెన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా రసాయన ఎరువులు, పురుగు మందులు లేని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను స్వయంగా పండించుకోవచ్చని తెలిపారు. “హెల్తీ ఫుడ్ – హెల్తీ లైఫ్” భావనను ప్రస్తావిస్తూ ప్రజలు ప్రకృతి ఆధారిత ఆహారాన్ని స్వీకరించాలని పిలుపునిచ్చారు. పీఎండీఎస్ ప్రక్రియలో భాగంగా సుమారు 30 రకాల పంటల విత్తనాలను ఎంపిక చేసి, బీజామృతంతో శుద్ధి చేసి, బంకమట్టి, ఘన జీవామృతం, బూడిదతో కోటింగ్ చేసి విత్తన గుళికలు తయారు చేశారు.
ఈ విత్తన గుళికలను భూమిలో సమాన దూరంతో విత్తి, తక్కువ నీటి వినియోగంతో పంటల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు కల్పించారు. అలాగే ఈ విధానం ప్రయోజనాలు, అమలు విధానం పై అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (ప్రకృతి వ్యవసాయం) కె. అమల కుమారి మాట్లాడుతూ, పీఎండీఎస్ విధానం ద్వారా తొలకరి వర్షాలకు ముందుగానే విత్తనాలు విత్తడం వల్ల భూమిలో తేమ నిల్వ ఉండి, నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు సంవత్సరం పొడవునా పంటల లభ్యత సాధ్యమవుతుందని తెలిపారు.
30–40 రోజుల తరువాత పీఎండీఎస్ పంటను పశువుల మేతగా వినియోగించి, మిగిలిన అవశేషాలను భూమిలో కలిపి కుళ్లబెట్టడం ద్వారా నేల సారాన్ని పెంచి, తదుపరి న్యూట్రి గార్డెన్‌కు అనుకూలమైన బెడ్లు సిద్ధం చేసుకోవచ్చని వివరించారు. ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు విత్తన గుళికల తయారీ ముఖ్యమని పేర్కొన్నారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ మార్కెటింగ్ స్టాల్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పోషకాహార, ప్రకృతి ఆధారిత ఆహార ఉత్పత్తులపై ప్రజలు అధిక ఆసక్తి కనబరిచారు.
ఈ ప్రదేశంలో భవిష్యత్తులో న్యూట్రి గార్డెన్, సూర్యమండలం నమూనాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధవి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు, పీడీ డిఆర్డిఏ ఝాన్సీ, డీపీఓ నాగేశ్వర్ నాయక్, ఇతర జిల్లా స్థాయి అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
