Nandikotkur | కాల్ మనీ భూత‌మే కార‌ణం…

అప్పుల బాధ.. కుటుంబం ఆత్మహత్యాయత్నం…
మా బండి లాక్కెళ్లారు… నాన్న ఏడ్చాడు…
ఆసుపత్రిలో కన్నీటి పర్యంతమైన 9ఏళ్ల కూతురు


Nandikotkur | నందికొట్కూర్, జులై 29 (ఆంధ్రప్రభ) : అప్పుల ఊబిలో కూరుకుపోయి కాల్ మనీ ఫైనాన్స్ వేధింపులు భరించలేక నంద్యాల జిల్లాలో మరో కుటుంబం నిండా మునిగింది. పాములపాడు మండలం ఎర్రగూడూరు వద్ద నిన్న కుటుంబం మొత్తం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నందికొట్కూరు మండలం మల్యాల గ్రామానికి చెందిన రామసుబ్బయ్య(38) తన భార్య మాధవి(34) కూతుళ్లు తేజ(9) అక్షయ(7)తో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పేద కుటుంబాల అవసరాన్ని ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలతో వేధిస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ఆగడాలకు ఇది పరాకాష్ట.ఈ ఘటనలో కోలుకుంటున్న పెద్ద కూతురు తేజ(9) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మాట్లాడుతూ… కన్నీటి పర్యంతమైంది. మా నాన్న బొలెరో నడిపేవాడు. ఫైనాన్స్ వాళ్లు బండి తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి మా నాన్న చాలా బాధపడ్డాడు అని పాప చెప్పింది.

జీవనాధారం కోల్పోయి అప్పుల వాళ్ల ఒత్తిడి పెరగడంతో తండ్రి తీవ్ర మనస్తాపానికి గురై కుటుంబంతో సహా ఈ దారుణానికి ఒడిగట్టాడని పాప మాటల్లో స్పష్టమవుతోంది. రామసుబ్బయ్య ఫైనాన్స్‌లో తీసుకున్న బొలెరో వాహనానికి రెండు కంతులు కట్టలేకపోవడంతో కంపెనీ సిబ్బంది కొన్ని రోజుల క్రితం వాహనాన్ని బలవంతంగా లాక్కెళ్లారు. ఉపాధి కోల్పోయి అప్పుల వాళ్ల బెదిరింపులు ఎక్కువ కావడంతో భరించలేక నిన్న కుటుంబం మొత్తం విషం తాగారు. కాల్ మనీ ముఠాలు కొన్ని ఫైనాన్స్ సంస్థలు పేద అమాయక కుటుంబాలనే టార్గెట్ చేస్తున్నాయి. ముందుగా నమ్మించి అప్పులిచ్చి, తర్వాత చక్రవడ్డీలు, అపరాధ రుసుముల పేరుతో వేధిస్తున్నారు. ఇంటికి వచ్చి బెదిరించడం వాహనాలు, ఆస్తులు బలవంతంగా లాక్కెళ్లడం పరిపాటిగా మారింది.

ఆసుపత్రిలో చికిత్స… పోలీసుల దర్యాప్తు…


విషం తాగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆత్మకూరు ఆసుపత్రికి, అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామసుబ్బయ్య, మాధవి, చిన్న కూతురు అక్షయ(7)ల‌ పరిస్థితి విషమంగా ఉంది. పెద్ద కూతురు తేజ కోలుకుంటోంది. పాములపాడు పోలీసులు కేసు నమోదు చేసి ఫైనాన్స్ సంస్థ వేధింపుల కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అక్రమ వడ్డీ వ్యాపారులపై కాల్ మనీ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.