ప్రమాదకరంగా మారిన డైవర్షన్ రోడ్డు
వర్షాల ఉధృతికి కొట్టుకుపోయిన మార్గం..
శనిగకుంట గ్రామానికి నిలిచిన రాకపోకలు
మంగపేట, ఆంధ్రప్రభ: మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ములుగు జిల్లా మంగపేట మండలంలోని నర్సింహాసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనిగకుంట గ్రామ సమీపంలోని కూడలి ఒర్రె ఉధృతి తీవ్రంగా పెరిగింది.
కూడలి ఒర్రెపై నూతన వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతి పెరగడంతో బుధవారం డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది.
డైవర్షన్ రోడ్డు ప్రమాదకరంగా మారడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. దీంతో శనిగకుంట గ్రామానికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షాలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు ప్రజలు డైవర్షన్ మార్గాన్ని ఉపయోగించవద్దని, అధికారులు సూచించే భద్రతా మార్గదర్శకాలను పాటించాలని స్థానికులు కోరుతున్నారు.
