ప్రజా సమస్యల పరిష్కారమే టీడీపీ లక్ష్యం: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: మచిలీపట్నం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మచిలీపట్నం పార్లమెంట్ స్థాయి సమావేశంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, కృష్ణా జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ పాల్గొన్నారు. సమావేశానికి పార్లమెంట్ కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన ధ్యేయమని అన్నారు. ప్రతి నెల నాలుగో బుధవారం పార్లమెంట్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను స్థానిక పార్టీ కార్యాలయాల్లో స్వీకరించి, ప్రతి కార్యకర్త ప్రజా సమస్యను తన సొంత సమస్యగా భావించి బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని ఆయన సూచించారు. అలాగే ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేస్తూ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.