భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి

డ్రైవింగ్ సమయంలో జాగ్రత్త వహించండి

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణ మండలంలోని గ్రామాల ప్రజలు భారీ వర్షాల దృష్ట్యా జాగ్రత్తగా వ్యవహరించాలని, వాహనదారులు డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తలు పాటించాలని పరకాల పోలీస్ సిఐ వి క్రాంతి కుమార్ కోరారు. భారీ వర్షాల దృష్ట్యా శిధిలావస్థలో ఉన్న పాత ఇండ్లలో ఉండవద్దని, ఇనుప కరెంటు స్తంభాల పక్కనుండి నడిచి వెళ్ళవద్దని, వర్షం కురిసె సమయంలో మత్స్యకారులు వాగులు, చెరువులకు చేపలు పట్టడానికి వెళ్ళవద్దని సిఐ క్రాంతి కుమార్ కోరారు.

అదే విధంగా వర్షాల వేళ నెమ్మదిగా వాహనం నడపాలని, వర్షంలో రోడ్లు జారుడుగా ఉంటాయని, వాహనాలు, బైకులు అకస్మాత్తుగా బ్రేక్ వేయవద్దు, వేగంగా మలుపులు తిరగవద్దని, నీరు నిలిచిన రహదారులపై వాహనం నడపవద్దని, నీటిలో కనిపించని గుంతల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తెగి పడిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని, వర్షపు నీటిలో విద్యుత్ ప్రసరించే ప్రమాదం ఉందని, వెంటనే సంబంధిత అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, వాహనాలను నిలుపువద్దని, పాత భవనాలు, బలహీనమైన గోడలకు దూరంగా ఉండాలని, వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని,ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలన్నారు. వర్షం పడుతున్న సమయంలో వాహనం నడిపేటప్పుడు హెడ్లైట్లు ఆన్ లో ఉంచాలన్నారు. వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని, క్షేమంగా ఇంటికి చేరే విధంగా ప్రజలు, వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని సిఐ క్రాంతికుమార్ కోరారు.