ప్రకటనలు కాదు.. రోడ్ల పనులు ప్రారంభించండి..!

వికారాబాద్, ఆంధ్రప్రభ: వికారాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు వందల కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి పనులను ప్రకటించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని, వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం వికారాబాద్ జిల్లాలోని మోత్కుపల్లి, బంటారం, మైలార్దేరంపల్లి తదితర ప్రాంతాల రహదారులను సీపీఎం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. గత రెండేళ్లుగా ఈ రహదారులకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిధుల ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమవుతోందని, క్షేత్రస్థాయిలో ఎక్కడా పనులు ప్రారంభం కావడం లేదని విమర్శించారు.

వికారాబాద్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని మైపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు గోపాల్ రెడ్డి, సురేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.