రోడ్డుకు ఆనుకొని ప్రీ కాస్ట్ వాల్ నిర్మాణం.. పోచారం గ్రామస్తుల ఆందోళన

  • పశువుల మేత దారులకు ఆటంకం కలుగుతుందని ఆరోపణలు
  • ప్రభుత్వ భూమి కబ్జాపై అనుమానాలు
  • తహసీల్దార్, ఎంపీడీవోకు లిఖితపూర్వక ఫిర్యాదు
  • అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్
  • సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఉద్యమిస్తామని స్పష్టం

ఎడపల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట శివారులోని పోచారం గేటు ఎదురుగా, పోచారం బస్ షెల్టర్ వెనుక బోధన్–నిజామాబాద్ రహదారిని ఆనుకుని నిర్మిస్తున్న ప్రీకాస్ట్ వాల్‌పై పోచారం గ్రామస్తులు శనివారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణం వల్ల గ్రామ ప్రజలకు, ముఖ్యంగా పశుపోషకులకు ఇబ్బందులు తలెత్తనున్నాయని ఆరోపిస్తూ ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి, ఎంపీడీవో శంకర్‌లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

గ్రామస్తుల కథనం ప్రకారం, సంబంధిత భూములకు అడ్డంగా ప్రీకాస్ట్ వాల్ నిర్మించి గేట్లు ఏర్పాటు చేయడంతో దశాబ్దాలుగా పశువులను మేత కోసం తీసుకెళ్లే సంప్రదాయ మార్గం మూసుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గుట్ట ప్రాంతాలకు చేరుకోవడం కష్టసాధ్యంగా మారి పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు.

అంతేకాకుండా, కొందరు వ్యక్తులు తమ పట్టా భూములతో పాటు ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగిందా లేదా అనే అంశాన్ని నిర్ధారించాలని కోరారు. నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వెంటనే తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నీరడి రవికుమార్ మాట్లాడుతూ, చిన్నతనం నుంచి గ్రామ పశువులను గుట్ట ప్రాంతాలకు మేత కోసం తీసుకెళ్లే దారిని ప్రస్తుతం ప్రీకాస్ట్ వాల్ నిర్మాణంతో మూసివేస్తున్నారని ఆరోపించారు. వంట చెరుకు కోసం కూడా ఇదే మార్గాన్ని గ్రామస్తులు ఉపయోగించేవారని, ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోతోందని తెలిపారు. పట్టా భూములతో పాటు ప్రభుత్వ భూమి కూడా ఈ నిర్మాణాల్లో భాగమైనట్లు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేయడంతో పాటు అవసరమైతే మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ భజనోళ్ల గంగారాం, క్యాషియర్ లక్ష్మీనారాయణ, గ్రామస్తులు జక్కు సాయన్న, చిన్న లక్ష్మయ్య, సాకలి పోశెట్టి, రజాక్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.