ఎల్‌నినో పై సమీక్షకు శాఖలు సిద్ధం కావాలి
- 20న జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం
- శాఖల వారీగా పూర్తి సమాచారంతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు సిద్ధం చేయాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులపై ఈ నెల 20న జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి అన్ని శాఖలు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ఈ నెల 20న ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించనున్న సమీక్ష సమావేశాల ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల సమన్వయంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రుల అధ్యక్షతన ఉమ్మడి జిల్లా స్థాయిలో సమగ్ర సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో వర్షాభావ పరిస్థితులు, తాగునీటి లభ్యత, జలాశయాల్లో నీటి నిల్వలు, వ్యవసాయ, ఉద్యాన పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు, భూగర్భ జలాల స్థితి, విద్యుత్ సరఫరా, తాగునీటి పంపిణీ, నీటి సంరక్షణ చర్యలు తదితర అంశాలపై శాఖల వారీగా సమగ్ర సమీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఇందుకోసం అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ నెల 20న జరిగే ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి అన్ని శాఖలు సమగ్ర సమాచారంతో హాజరుకావాలని సూచించారు.
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, తాగునీటి లభ్యత, జలాశయాల్లో నీటి నిల్వలు, వ్యవసాయ, ఉద్యాన పంటల స్థితిగతులు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, భూగర్భ జలాల పరిస్థితి, విద్యుత్ సరఫరా, నీటి సంరక్షణ చర్యలు తదితర అంశాలపై శాఖల వారీగా పూర్తి వివరాలతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు సిద్ధం చేసి సమావేశంలో సమర్పించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పాండు, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీఆర్‌డీఓ (పీడీ) జ్యోతి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
