ప్రభుత్వ ఆసుపత్రులపై కాంగ్రెస్ నిర్లక్ష్యం : పువ్వాడ అజయ్ కుమార్

  • మందులు, సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణ
  • ఖమ్మం ప్రభుత్వాసుపత్రి పూర్వ వైభవం తీసుకురావాలని డిమాండ్

ఖమ్మం ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు ఇతర ప్రభుత్వాసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. అవసరమైన మందులు, సిరంజీలు, గ్లోవ్స్‌తో పాటు ఇతర ప్రాథమిక వైద్య సామగ్రి కొరత ఉందనే వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు.

వైద్యులు, నిపుణులైన స్పెషలిస్టులు, నర్సింగ్ సిబ్బంది కొరత కారణంగా వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయని, దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితులు ప్రాణనష్టానికి కూడా దారితీస్తున్నాయని ఆరోపించారు.

ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైద్య వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం బాధాకరమని పువ్వాడ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులను గణనీయంగా అభివృద్ధి చేశామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ పరిస్థితి మారిపోయిందని విమర్శించారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్న ఆయన, ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి గత వైభవాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.