వేల్పూర్‌లో అర్ధరాత్రి దుండగుల దుశ్చర్య

వేల్పూర్‌లో అర్ధరాత్రి దుండగుల దుశ్చర్య

  • రెండు వాహనాలకు నిప్పు

వేల్పూర్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని కేఎస్ఆర్ కాలనీలో అర్ధరాత్రి దుండగులు రెండు టూ వీలర్ వాహనాలకు నిప్పు పెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో కాలనీ వాసులు ఉలిక్కిపడి భయాందోళనకు గురయ్యారు.

స్థానికుల వివరాల ప్రకారం, శ్రావణ్ కుమార్ గౌడ్‌కు చెందిన స్కూటీని ఇంటి ముందు నిలిపి ఉంచగా, అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దానికి నిప్పు పెట్టారు. అదే సమయంలో పక్కనే ఉన్న వనందాస్ మహేందర్ గౌడ్‌కు చెందిన బైక్ కూడా మంటలకు ఆహుతై సగం వరకు కాలిపోయింది. స్కూటీ పూర్తిగా దగ్ధమైంది.

ఇటీవలే కొనుగోలు చేసిన స్కూటీ ఇలా కాలిపోవడంతో యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక గంజాయి సేవించిన వ్యక్తుల పాత్ర ఉందా, లేక కక్షపూరితంగా ఎవరైనా తగలబెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై బి. సంజీవ్ తెలిపారు.

Leave a Reply