ఎస్సీ, ఎస్టీ పథకాల అమలులో ప్రత్యేక దృష్టి సారించాలి
కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ పాఠశాలల్లో ఒక్క సీటు కూడా ఖాళీ ఉండొద్దు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్లు బి. శ్రీరాములు, జె. అరుణశ్రీతో కలిసి జిల్లా అధికారులతో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పురోగతిని వివరించారు.
గురుకులాలు, సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీలు), మోడల్ పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలపై కమిషన్ చైర్మన్ సమీక్షించారు.
ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి ఎస్సీ, ఎస్టీ బాధితుల పరిహారానికి సంబంధించిన 50 శాతం నిధులను విడుదల చేయించినట్లు తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఓవర్సీస్ విద్యా పథకం, ఎస్సీ, ఎస్టీ బాధితుల పరిహారం, గురుకుల విద్యాసంస్థలకు సంబంధించిన పెండింగ్ నిధుల వివరాలను వెంటనే కమిషన్కు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ నెలాఖరులో ముఖ్యమంత్రితో సమావేశం నిర్వహించనున్నందున పెండింగ్ నిధుల విడుదల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి మిగిలిన నిధులను కూడా విడుదల చేయించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
జిల్లాలోని గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ పాఠశాలల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా లేకుండా పూర్తి విద్యార్థి సామర్థ్యంతో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు అమలులో ఉన్న రిజర్వేషన్లను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఉపాధి కల్పన కార్యాలయం, వారధి సొసైటీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి, సత్వర విచారణ నిర్వహించి ఛార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. అలాగే ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి, సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కమిషన్ చైర్మన్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట ప్రవీణ్, ఆర్డీఓలు బి. గంగయ్య, సురేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్, గోదావరిఖని ఏసీపీ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
