ఘనంగా ఇంటర్ మెరిట్ విద్యార్థులకు సన్మానం..

భీమారం, ఆంధ్రప్రభ : హైదరాబాద్ ఖానా శాంతి వనం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఇంటర్ మెరిట్ విద్యార్థుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్-హనుమకొండలోని ఇన్‌స్పైర్ జూనియర్ కళాశాల విద్యార్థిని తీగల సాయి శ్రేష్టిత ఇంటర్మీడియట్‌లో 1000 మార్కులకు గాను 997 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా సాయి శ్రేష్టిత గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందుకుంది.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, మెరిట్ సాధించిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల కృషి, అంకితభావానికి గుర్తింపుగా ఇలాంటి పురస్కారాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

అనంతరం ఇన్‌స్పైర్ జూనియర్ కళాశాల చైర్మన్ తీగల భరత్ గౌడ్, ప్రిన్సిపాల్ సుంకరి శ్రీరామ్ రెడ్డి, డైరెక్టర్లు తీగల రాజ్‌కుమార్, కోటిచింతల మమత కుమారి, లాడే శివ గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రం అందుకున్న విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు.

విద్యార్థిని సాధించిన ఈ ఘనత కళాశాలకు గర్వకారణమని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ఉన్నత విజయాలు సాధించి కళాశాలకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.