సింగరేణి లాభాల వివరాలు వెంటనే ప్రకటించాలి..
కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలి: టీఎస్‌యూఎస్
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగరేణి లాభాల వివరాలను యాజమాన్యం వెంటనే ప్రకటించి, ఆ లాభాల్లో 35 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం (టీఎస్‌యూఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య డిమాండ్ చేశారు.
ఆదివారం సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు లాభాల వివరాలను అధికారికంగా వెల్లడించకపోవడం సరికాదన్నారు.
సింగరేణి సంస్థ వాస్తవ లాభాలను పారదర్శకంగా ప్రకటించి, కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను వెంటనే అందజేయాలని ఆయన కోరారు. ఈ విషయంలో గుర్తింపు పొందిన ప్రాతినిధ్య కార్మిక సంఘాలు కూడా చొరవ తీసుకుని యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
ఈ సమావేశంలో సంఘం నాయకులు దాసరి జనార్ధన్, నామల శ్రీనివాస్, కాసర్ల ప్రసాద్‌రెడ్డి, రాళ్లబండి బాబు, జయశంకర్, ఎం. మధుకర్, ఎండీ సాజిత్, నరసింహారెడ్డి, సలీం, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
