విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర కీలకం..

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల కంటే మెరుగైన ప్రతిభ కనబరుస్తారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.

పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట ఎంపీపీఎస్ పాఠశాలలో శనివారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాఠశాలల్లో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, తల్లిదండ్రుల బాధ్యతలపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తుర్కలమద్దికుంట ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయిందని, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన అన్ని మౌలిక వసతుల పనులను రానున్న ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ఈ లక్ష్యాన్ని సాధించడంలో తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా పేరెంట్–టీచర్ సమావేశాలకు హాజరై తమ పిల్లల చదువు, పురోగతి గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.

విద్యార్థులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, ఏదైనా కారణంతో పాఠశాలకు రాలేకపోతే వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని అన్నారు. ప్రతిరోజూ పిల్లలతో కొంత సమయం గడుపుతూ వారు నేర్చుకున్న పాఠాలు, హోంవర్క్ గురించి తెలుసుకుని పూర్తి చేసేలా ప్రోత్సహించాలని కోరారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, జిల్లా యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రుల సంపూర్ణ సహకారం లభిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ శారద, జీసీడీఓ కవిత, సర్పంచ్ గోగు రాజయ్య, పెద్దపల్లి పీఏసీఎస్ చైర్‌పర్సన్ ముత్యాల నరేష్, ఉపసర్పంచ్ ముత్యాల తిరుపతి, ప్రధానోపాధ్యాయురాలు మంజులత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.