గరిడేపల్లిలో ఘనంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు
గరిడేపల్లి, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించాయి. హుజూర్‌నగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి, పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కడియం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, జగదీశ్ రెడ్డి రైతు పక్షపాతి నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు.
కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించి సూర్యాపేట, పెన్‌పహాడ్, కోదాడ నియోజకవర్గాల చివరి ఆయకట్టు వరకు నీరందించిన ఘనత జగదీశ్ రెడ్డిదేనని పేర్కొన్నారు. ఈ ప్రాంత రైతుల హృదయాల్లో ఆయన శాశ్వత స్థానం సంపాదించుకున్నారని తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, స్వరాష్ట్ర సాధన వరకు ముందువరుసలో ఉండి పోరాడిన నాయకుడిగా జగదీశ్ రెడ్డి సేవలను ఆయన గుర్తు చేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు మాశెట్టి శ్రీహరి, బొలిశెట్టి సుధీర్, బోధ సైదిరెడ్డి, బచ్చలకూరి శ్రీను, సుధా నాగరాజు, బొల్లిపల్లి రామనాథం, సుధాకర్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ, మన్సూర్ అలీ, మండల మహిళా అధ్యక్షురాలు గంధ వినోద తదితరులు పాల్గొన్నారు.
