బాధిత కుటుంబానికి పరామర్శ..
- పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామానికి చెందిన నరేంద్రబాబు (40), ఓం లత (35) దంపతులు ఇటీవల జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరూ పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తుండటంతో ఈ ఘటన స్థానికంగా మరింత విషాదాన్ని మిగిల్చింది.
ఈ విషయం తెలుసుకున్న పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి శనివారం మృతదంపతుల నివాసానికి వెళ్లి వారి పార్థివ దేహాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అలాగే మృతుల తల్లిదండ్రులు, బంధువులను పరామర్శిస్తూ ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యంతో ఉండాలని సూచించారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, చిన్నారుల భవిష్యత్తు కోసం తన వంతు సహాయం అందిస్తానని శ్రీధర్ రెడ్డి భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా అక్కడి వాతావరణం హృదయవిదారకంగా మారింది. బంధువులు, స్థానికులు మృతదంపతులను స్మరించుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. సమాజానికి సేవలందిస్తున్న ఇద్దరు వైద్య సేవా సిబ్బంది ఒకేసారి మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, మృతుల కుటుంబ సభ్యులు పాల్గొని మృతదంపతులకు నివాళులర్పించారు.
