AP | అనంత ఆణిముత్యం అవార్డు వేడుకలకు

AP | అనంత ఆణిముత్యం అవార్డు వేడుకలకు
- ముఖ్య అతిథిగా బ్రహ్మానందం
AP | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రముఖ హాస్య నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం జనవరి 24వ తేదీన పెనుకొండలో నిర్వహించనున్న అనంతఆణిముత్యం అవార్డు (Award) ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. బ్రహ్మానందం అదే రోజు ఉదయం బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు పెనుకొండ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారని తెలిపారు.
సాయంత్రం (Evening) ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు జరిగే ఈ అవార్డు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన అవార్డు గ్రహీతలకు బ్రహ్మానందం స్వయంగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. సాహిత్యం, సంస్కృతి, కళలు, సేవా రంగాల్లో కృషి చేసిన ప్రతిభావంతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తనకు అవకాశం కల్పించిన సాహితీ గగన్ మహల్ ట్రస్ట్ (Trust) వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని, యువతకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు జె.ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం హాజరుకావడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. పెనుకొండలో (Penukonda) ఇంతటి స్థాయిలో జరుగుతున్న ఈ సాంస్కృతిక వేడుకలను ప్రజలంతా ఆదరించి, అవార్డు గ్రహీతలను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
