పుట్టపర్తిలో ర్యాలీలు, ధర్నాలకు కీలక ఆంక్షలు
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: పుట్టపర్తిలో గణేష్ కూడలి నుంచి విద్యాగిరి ఆర్చ్ వరకు ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు నిర్వహించేందుకు అనుమతి లేదని పట్టణ సీఐ యువరాజు స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, సత్యసాయి భక్తులు, విద్యార్థులు అధిక సంఖ్యలో సంచరించే ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గణేష్ కూడలి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిత్యం భక్తులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుండటంతో ఆ ప్రాంతంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. అత్యవసరంగా వినతిపత్రం సమర్పించాల్సి వచ్చినా, ఐదుగురికి మాత్రమే కలెక్టరేట్‌లో అర్జీ అందజేసేందుకు పోలీసు శాఖ అనుమతి ఇస్తుందని చెప్పారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలనుకునే వారు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధర్నా చౌక్‌ను వినియోగించాలని సూచించారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు..
అదేవిధంగా గణేష్ కూడలి నుంచి ప్రశాంతి మందిరం మీదుగా సత్యమ్మ కూడలి వరకు భారీ వాహనాలు, షేర్ ఆటోలకు అనుమతి లేదని తెలిపారు. ఈ వాహనాలు చిత్రావతి బైపాస్ మార్గాన్ని వినియోగించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని సీఐ యువరాజు కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, రోడ్డు భద్రత నిబంధనలు పాటించి భక్తులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
