ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు వెంటనే చేపట్టాలి
- పెండింగ్ పీఆర్సీ, డీఏ ప్రకటించాలి..
- తపస్ ఉపాధ్యాయ సంఘం డిమాండ్..
- ఆగస్టు 1న రాష్ట్రస్థాయి ధర్నాను విజయవంతం చేయాలని పిలుపు
ఊట్కూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను వెంటనే చేపట్టడంతో పాటు, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏలను తక్షణమే ప్రకటించాలని తపస్ ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షుడు కే. కృష్ణ డిమాండ్ చేశారు.
శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని నిడుగుర్తి, లక్ష్మీపల్లి, టీఆర్పీ తండా, బాపూర్, తిప్రాస్‌పల్లి, ఓబులాపూర్, అమీన్‌పూర్, పగిడిమర్రి గ్రామాల పాఠశాలల్లో తపస్ ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే, ఆరోగ్య కార్డు కోసం ఒకరి వేతనం నుంచే చందా మినహాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలను ఆలస్యం చేయకుండా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తపస్ సంఘం ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతోందని, ఇప్పటికే మండల, జిల్లా స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆగస్టు 1న రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న భారీ ధర్నాలో ఉపాధ్యాయులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తపస్ మండల కార్యదర్శి గోపాల్, కోశాధికారి రమేష్, కాంప్లెక్స్ ఇన్‌చార్జి కృష్ణ, జిల్లా మీడియా ఇన్‌చార్జి కిరణ్, జిల్లా నాయకులు రాములు, పారిజాత, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
