దళితులు, గిరిజనులు సమస్యలు విన్నవించండి
- నేడు పెద్దపల్లిలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ ప్రత్యేక సమావేశం..
- బాధితులు, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరుకావాలని విజ్ఞప్తి
గోదావరిఖని, ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లాలోని దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు శనివారం జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కవ్వంపల్లి సతీష్, దావు రమేష్ తెలిపారు.
శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవ్వంపల్లి సతీష్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, రేణిగుంట్ల ప్రవీణ్, నీలాదేవి, రాంబాబు నాయక్ శనివారం పెద్దపల్లికి రానున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల తర్వాత జిల్లా కలెక్టరేట్లో సమావేశం ప్రారంభమవుతుందని, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కూడా పాల్గొంటారని తెలిపారు.
జిల్లాలోని దళిత, గిరిజన కుటుంబాలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, వివక్ష, వేధింపులు, ఇతర పెండింగ్ సమస్యలను ఈ సమావేశంలో కమిషన్ ముందు నేరుగా విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు.
పాఠశాలల్లో పనిచేస్తున్న దళిత, గిరిజన ఉపాధ్యాయులు, సిబ్బందికి వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యం, అన్యాయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే అర్హులైన దళిత, గిరిజన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని కోరనున్నట్లు చెప్పారు.
గోదావరిఖనిలో అంబేద్కర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలతో అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణ ప్రతిపాదనను కూడా రాష్ట్ర ఎస్సీ కమిషన్ ముందుంచనున్నట్లు కవ్వంపల్లి సతీష్ వెల్లడించారు.
జిల్లాలోని దళిత, గిరిజన సంఘాలు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రజాప్రతినిధులు, బాధితులు పెద్ద సంఖ్యలో సమావేశానికి హాజరై తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.
