State Finance Minister | ఏపీ అభివృద్ధికి కేంద్రం అండ..

State Finance Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టిన వారిని గతంలో చూశామని, ప్రజల ఆర్థికాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఇవాళ‌ నరసరావుపేటలో నిర్వహించిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఒకే రోజున రూ.3 వేల కోట్ల రుణాలను కూటమి ప్రభుత్వం అందించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఏ పని చేయాలన్నా ఖజానాలో నిధులు లేని పరిస్థితి ఎదురైందని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర అవసరాలకు కేంద్రం నుంచి నిరంతరం సహకారం అందుతోందని చెప్పారు.

నిర్మలా సీతారామన్‌ను ప్రశంసిస్తూ, ఒక మహిళ తన ఇంటిని ఎలా చక్కగా తీర్చిదిద్దుతుందో, అంతకంటే మెరుగ్గా దేశ ఆర్థిక వ్యవస్థను ఆమె నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటు ఫలితంగానే అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు పరిరక్షణ, ‘తల్లికి వందనం’, ఉచిత బస్సు వంటి పథకాలతో పాటు గూగుల్ వంటి సంస్థల పెట్టుబడులు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.

రాష్ట్రానికి ఎలాంటి అవసరం వచ్చినా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను సంప్రదిస్తున్నామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కోరిన ప్రతి అంశంపై ఆమె సానుకూలంగా స్పందిస్తున్నారని మంత్రి తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణలో కేంద్రం తీసుకున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోందని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.