BRS Youth Sangrama | ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్‌

‘యువ సంగ్రామ’ సదస్సుకు అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్ ఆగ్రహం
ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్య అంటూ ప్రభుత్వంపై విమర్శలు
అనుమతి కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించామని వెల్లడి.. సదస్సును విజయవంతం చేస్తామని స్పష్టం

BRS Youth Sangrama | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సరూర్‌నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జూలై 18న నిర్వహించ తలపెట్టిన ‘యువ సంగ్రామ సదస్సు’కు పోలీసులు అనుమతి నిరాకరించడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే చర్యగా అభివర్ణించారు. ఈ అంశంపై బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ.. యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదస్సు కోసం గత నెలలోనే కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. కలెక్టర్‌కు ఇచ్చిన దరఖాస్తు ఆధారంగా స్పోర్ట్స్ అథారిటీకి కూడా సమాచారం అందించామని, జూలై 8న పోలీస్ కమిషనర్‌కు అధికారికంగా లేఖ సమర్పించినట్లు చెప్పారు.

సభ నిర్వహణకు సంబంధించి పోలీసులు సూచించిన నిబంధనలను పూర్తిగా పాటించామని, సీసీ కెమెరాల ఏర్పాటు, డీడీల చెల్లింపులు సహా కోరిన అన్ని వివరాలను అందించినప్పటికీ అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. అనుమతి విషయంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తాను పోలీస్ కమిషనర్‌ను సంప్రదించే ప్రయత్నం చేసినా స్పందన రాలేదని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సభకు అనుమతి ఇవ్వొద్దని పోలీసు అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం ఉందని శంభీపూర్ రాజు ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చామని, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతోనే యువ సంగ్రామ సదస్సుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా సదస్సు విజయవంతమవుతుందని, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనుమతి నిరాకరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు వెల్లడించారు.

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. జూన్ 30న సదస్సు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. పోలీసులు విడతలవారీగా కోరిన ఆరు రకాల వివరాలను కూడా సమర్పించామని చెప్పారు. గత రెండు రోజులుగా పోలీస్ కమిషనర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన లేదని, ఏసీపీ స్థాయి అధికారుల ద్వారా మాట్లాడించినప్పటికీ అనుమతి లభించలేదని పేర్కొన్నారు. యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే సదస్సును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగాల హామీ, నిరుద్యోగుల సమస్యలు, విద్యార్థుల అంశాలపై ప్రశ్నలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదని విమర్శించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగుల సమస్యలు, విద్యార్థులపై చర్యలు వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆయన.. అనుమతి ఇవ్వకపోతే సరూర్‌నగర్ స్టేడియం వద్దకు చేరుకుని తమ నిరసనను తెలియజేస్తామని హెచ్చరించారు.