న్యూఢిల్లీ – అన్న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. సమాజానికి సేవ చేయడానికి, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. సినిమా మాధ్యమంగా ఎన్టీఆర్.. యావత్ సమాజాన్ని చైతన్యవంతులు చేశారని మోదీ చెప్పారు.
ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే సమాజంలో స్ఫూర్తినింపే సినిమాలు తీశారని అన్నారు. తాము అందరం ఎన్టీఆర్ నుండి ఎంతో ప్రేరణ పొందామని మోదీ నివాళి అర్పించారు. తన స్నేహితుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఏపీలో అదికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఎన్టీఆర్ ఆశయాలను సాధించడానికి, ఆయన దార్శనికతలో ప్రయాణించడానికి నిరంతరాయంగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.