SIR Telangana | ఫారాలు పూర్తి.. డిజిటైజేషన్ స్లో
నగర జిల్లాల్లో మందగించిన సర్ ప్రక్రియ
ఎస్‌ఐఆర్‌లో ఫారాల పంపిణీ 100 శాతం పూర్తి..
డిజిటైజేషన్ 58 శాతమే
మేడ్చల్‌లో 28.41 శాతం, హైదరాబాద్‌లో 31.54 శాతం మాత్రమే పూర్తి
SIR Telangana | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినప్పటికీ, వాటి డిజిటైజేషన్ ప్రక్రియ మాత్రం నెమ్మదిగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఓటర్లకు 100 శాతం ఫారాల పంపిణీ పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,281 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయగా, ఇప్పటివరకు 1,97,70,098 ఫారాలు మాత్రమే డిజిటైజ్ అయ్యాయి. అంటే మొత్తం ప్రక్రియలో 58.45 శాతం మాత్రమే పూర్తయింది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో డిజిటైజేషన్ వేగంగా సాగుతుండగా, హైదరాబాద్ పరిధిలోని నగర జిల్లాల్లో పురోగతి మందగించింది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో డిజిటైజేషన్ 28.41 శాతంతో రాష్ట్రంలో అత్యల్పంగా నమోదైంది. హైదరాబాద్ జిల్లాలో 31.54 శాతం, రంగారెడ్డి జిల్లాలో 41.46 శాతం మాత్రమే పూర్తయింది. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా 85.18 శాతంతో రాష్ట్రంలో ముందంజలో ఉండగా, సిద్ధిపేట 79.74 శాతం, నల్గొండ 79.42 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇదిలా ఉండగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ, రసీదుల జారీ విషయంలో కొందరు ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఫారాలు సమర్పించిన తర్వాత బూత్ లెవల్ అధికారులు (BLO) నుంచి రసీదులు అందడం లేదని, పలుమార్లు సంప్రదించినా స్పందన లభించడం లేదని కొందరు ఓటర్లు చెబుతున్నారు.
2024 ఓటర్ల జాబితా, 2002 నాటి రికార్డుల మధ్య వ్యత్యాసాలపై కూడా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఓటర్లు జూలై 30లోగా అవసరమైన ఫారాలను సమర్పించాలని సూచించారు. అవసరమైన పత్రాలు లేకపోయినా ముందుగా ఎన్యూమరేషన్ ఫారం అందించాలని, తర్వాత అవసరమైన ఆధారాలు సమర్పించే అవకాశం ఉంటుందని తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రక్రియ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఫారాల సేకరణ, ఇంటింటి పరిశీలన ప్రక్రియను ఆగస్టు 3, 2026 వరకు పొడిగించింది. ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనుండగా, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 8 వరకు కొనసాగనుంది. అనంతరం తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 12, 2026న విడుదల చేయనుంది.
