భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం: మంత్రి సీతక్క
మంగపేట, ఆంధ్రప్రభ : రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించే భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అభివృద్ధి కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు.
గురువారం ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అర్చకులు, కార్యనిర్వాహక అధికారి, ఆలయ సిబ్బంది సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.

స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధితో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి, కళ్యాణ మండపం, అన్నదాన సత్రం, కళ్యాణకట్ట, రహదారి విస్తరణ, ఉప ఆలయాల అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, సంబంధిత జిల్లా, మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
