ఆగస్టు 3 వరకు ఎస్‌ఐఆర్ నమోదు..

  • ప్రతి అర్హ ఓటరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఊట్కూర్, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియకు గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రతి అర్హ ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఊట్కూర్ తహసీల్దార్ అశోక్ కుమార్ సూచించారు.

గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొల్లూరు, ఊట్కూర్ గ్రామాల్లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. నమోదు కేంద్రాలను సందర్శించి దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, అవసరమైన ధ్రువపత్రాల పరిశీలన తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించే లక్ష్యంతో ఎస్‌ఐఆర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గడువు ఆగస్టు 3 వరకు పొడిగించబడినందున ఇప్పటి వరకు నమోదు చేసుకోని అర్హులైన ఓటర్లు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.

నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) లేదా రెవెన్యూ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.

ప్రతి అర్హ పౌరుడు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి కావడం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో అవసరమని, అందరూ బాధ్యతగా ఎస్‌ఐఆర్ నమోదును పూర్తి చేయాలని తహసీల్దార్ పిలుపునిచ్చారు. అధికారులు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేగవంతంగా సేవలు అందించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కొల్లూరు సర్పంచ్ ఎం. రేణుక భరత్, ఊట్కూర్ సర్పంచ్ సువర్ణ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ చింతా రవి, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్రరెడ్డి, ఆర్‌ఐలు కృష్ణారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.