ఎస్‌ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్
వరంగల్, (ఆంధ్రప్రభ): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం దుగ్గొండి మండలంలోని లక్ష్మీపురం, దుగ్గొండి, గోపాలపురం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఓటరు వివరాల నమోదు, ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించిన ఆమె బీఎల్‌వోలు నిర్వహిస్తున్న పనితీరుపై ఆరా తీశారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించి, ఓటరు జాబితా శుద్ధి ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని ఆదేశించారు.
పరిశీలన సందర్భంగా రైతులతో మాట్లాడిన కలెక్టర్ గ్రామాల్లో పంటల సాగు పరిస్థితులు, సాగు విస్తీర్ణం, సాగుచేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటి వినియోగంతో సాగు చేయగల పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. అలాగే ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ ఇంటింటి సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలని బీఎల్‌వోలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, దుగ్గొండి తహసీల్దార్ సమ్మక్క, నర్సంపేట తహసీల్దార్ రవిచంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
