రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలి: బీఆర్ఎస్ నాయకులు

నడిగూడెం (ఆంధ్రప్రభ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని బుధవారం నడిగూడెం మండల బీఆర్ఎస్ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు పల్ల నర్సిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సిందిపోయి, రైతుల తరఫున ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సంయమనంతో వ్యవహరించాలని, ప్రజలను రెచ్చగొట్టేలా లేదా రాజకీయ విద్వేషాలను పెంచేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని, అందువల్ల ప్రభుత్వం, పోలీసు శాఖ వెంటనే స్పందించి ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు భువనగిరి ఉపేందర్, బొల్లెపల్లి వెంకన్న, గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి, ఎస్కే జలీల్, పోటు ప్రసాద్, ఏకుల నారాయణ, మేకల వీరబాబు, ఎండీ రఫీ, వల్లెపు శ్రీనివాస్, ఎండీ మౌలానా, దున్న రవి, డాక్టర్ సైదులు, పోలంపల్లి వెంకటేశ్వర్లు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.