రేగొండలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..

రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ మండలంలో జిల్లా కలెక్టర్ శనివారం ఆకస్మికంగా పర్యటించి పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న మొబైల్ టిబి ఎక్స్‌రే స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్, స్క్రీనింగ్ ప్రక్రియ, లక్ష్యాల సాధనపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డు గదితో పాటు కార్యాలయాన్ని పరిశీలించారు. భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో మరమ్మతుల కోసం వెంటనే ప్రతిపాదనలు పంపించాలని తహసీల్దార్ శ్వేతరావును ఆదేశించారు. అలాగే బల్క్ ల్యాండ్ సర్వే పురోగతిపై సమీక్షించి, సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

తదుపరి రావులపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, చిన్నారులకు నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. మాతా-శిశు సంరక్షణ రికార్డులు, మొబైల్ యాప్‌లో నమోదు చేసిన వ్యాక్సినేషన్ వివరాలను తనిఖీ చేసి, వ్యాధుల బారిన పడకుండా ప్రతి చిన్నారికి తప్పనిసరిగా టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, రేగొండ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హిమబిందు, తహసీల్దార్ శ్వేతరావు, ఎంపీడీవో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.