రాజబొల్లారంలో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

  • భక్తిశ్రద్ధలతో సీతారామచంద్రస్వామి వార్షికోత్సవం
  • ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి..

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారంలో వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వార్షికోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన సీతారామ కల్యాణ మహోత్సవంలో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డికి అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన సీతారామ కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, శ్రీ సీతారామచంద్రస్వామి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.