కెమికల్ కంపెనీలో భారీ పేలుడు

కెమికల్ కంపెనీలో భారీ పేలుడు
- రియాక్టర్ పేలడంతో ఎగిసిపడ్డ మంటలు..
- రూ.50 లక్షల ఆస్తి నష్టం
మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని ఓ కెమికల్ కంపెనీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. అర్గో కెమికల్స్ (Argo Chemicals) పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ఘటన సంభవించింది.
కంపెనీలో ఇథనాల్, మిథనాల్ వంటి అత్యంత ప్రమాదకరమైన, త్వరగా మండే రసాయనాలు నిల్వ ఉండటంతో మంటలు క్షణాల్లోనే భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.50 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు అర్గో కెమికల్స్ యజమాని భార్గవ్ రామ్ తెలిపారు.

అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రియాక్టర్ పేలిన వెంటనే అప్రమత్తమైన ఉద్యోగులు, కార్మికులు సురక్షితంగా బయటకు పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న వెంటనే నాలుగు ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నాయి. మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
ప్రమాద స్థలం నుంచి దట్టమైన నల్లటి పొగ ఎగిసిపడుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు పూర్తిగా ఆరిపోయిన అనంతరం రియాక్టర్ పేలుడుకు గల అసలు కారణాలు, భద్రతా ప్రమాణాల అమలుపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నారు.
