july11th Tirumala | తిరుమలలో వాహనాల భారీ క్యూ
భారీగా తరలివచ్చిన భక్తులు
శుభ ముహూర్తాలు ముగియనున్న నేపథ్యంలో పెరిగిన రద్దీ
పార్కింగ్ సమస్యతో తీవ్ర రద్దీ..
సోమవారం వరకు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూచిస్తున్న అధికారులు
july11th Tirumala | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. రేపటి నుంచి మూఢాలు ప్రారంభం కానుండటంతో, శుభ ముహూర్తాలు ముగిసేలోపు స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో వేలాది మంది భక్తులు కొండకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీతో పాటు వాహనాల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగాయి.
కొండపై పార్కింగ్ స్థలాలు దాదాపు నిండిపోయినప్పటికీ, అలిపిరి టోల్‌గేట్ వద్ద పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులు వాహనాలను అనుమతిస్తున్నారు. అయితే వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో పలుచోట్ల ట్రాఫిక్ రద్దీ నెలకొంది.
ప్రస్తుత పరిస్థితులను బట్టి తిరుమలలో భక్తుల సంఖ్య కూడా భారీగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసరం కాని భక్తులు సోమవారం తర్వాత తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిదని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణానికి ముందు తాజా పరిస్థితులను తెలుసుకుని బయలుదేరాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

