ఓటర్ల సందేహాలకు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమాధానాలు
ప్రత్యేక ఫోన్-ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన..
అర్హులందరికీ ఓటు హక్కే లక్ష్యమని స్పష్టం
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఎస్‌ఆర్) ప్రక్రియపై ప్రజల్లో ఉన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేసేందుకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏ. శ్యామ్ ప్రసాద్ శనివారం కలెక్టరేట్‌లో ప్రత్యేక ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఓటర్ల నుంచి విశేష స్పందన లభించింది.
ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు నిర్వహించిన ఈ ప్రత్యక్ష కార్యక్రమంలో ఓటర్లు ఫోన్ ద్వారా అడిగిన పలు సాంకేతిక, సాధారణ ప్రశ్నలకు కలెక్టర్ వివరంగా సమాధానాలు ఇచ్చారు.
ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా నింపాలి, అందులో ఏ వివరాలు నమోదు చేయాలి, 2002 ఓటర్ల జాబితాలోని వివరాలను ఎలా పొందాలి, పేరు లేకపోతే ఏ విధంగా నమోదు చేసుకోవాలి వంటి అంశాలపై కలెక్టర్ స్పష్టమైన వివరణ ఇచ్చారు.
అలాగే బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు)ను ఎలా సంప్రదించాలి, ఇతర ప్రాంతాల నుంచి శాశ్వతంగా వచ్చిన వారు, వేరే రాష్ట్రం నుంచి వివాహం చేసుకుని వచ్చిన మహిళలు ఓటు హక్కు కోసం ఏ ప్రక్రియను అనుసరించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. అవసరమైన నివాస ధ్రువీకరణ పత్రాలతో ఫారం-8 ద్వారా ఓటు బదిలీ లేదా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఓటర్లు తమ వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని సూచించారు.
