కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి

ఏడు ప్రతిపాదిత హైస్పీడ్ కారిడార్లలో మూడు తెలంగాణకు..
హైదరాబాద్ నుంచి పలు ప్రధాన నగరాలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని వ్యాఖ్య

ఆంధ్ర‌ప్రభ వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన ఏడు బుల్లెట్ రైలు కారిడార్లలో మూడు తెలంగాణకు సంబంధించినవేనని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి ఈ ప్రతిష్ఠాత్మక హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు లభించాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ దేశంలోనే కీలక బుల్లెట్ రైలు కేంద్రంగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బుల్లెట్ రైలు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు ప్రయాణ సమయం భారీగా తగ్గుతుందని మంత్రి చెప్పారు. హైదరాబాద్–బెంగళూరు ప్రయాణం సుమారు 2 గంటల 35 నిమిషాలు, హైదరాబాద్–పుణే 2 గంటలు, హైదరాబాద్–ముంబై 2 గంటల 20 నిమిషాలు, హైదరాబాద్–విజయవాడ 70 నిమిషాల్లో పూర్తి చేసే అవకాశం ఉంటుందని వివరించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టుల క్రెడిట్‌పై జరుగుతున్న రాజకీయ వ్యాఖ్యలను ప్రస్తావించిన అశ్వినీ వైష్ణవ్, ఈ ప్రాజెక్టుల ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని అన్నారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్‌లో సుమారు రూ.800 కోట్లు మాత్రమే కేటాయించారని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికే ఏటా సుమారు రూ.5,000 కోట్ల రైల్వే నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.

ఈ భారీ పెట్టుబడుల కారణంగానే రాష్ట్రంలో కొత్త రైల్వే మార్గాలు, స్టేషన్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులు అమల్లోకి వస్తే ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా కొత్త ఊపు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.