టీడీపీ ఎన్నారై జాతీయ కమిటీలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు కీలక పదవులు

అధ్యక్షుడిగా డాక్టర్ పిల్లి గురు రాజా.. ఆర్గనైజింగ్ సెక్రటరీగా షా ఫహద్ సయ్యద్

కర్నూల్ రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన టీడీపీ ఎన్నారై (ఎన్‌ఆర్‌ఐ) జాతీయ కమిటీలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులకు కీలక బాధ్యతలు దక్కాయి. దీంతో జిల్లాలో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ ఎన్నారై జాతీయ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ పిల్లి గురు రాజా నియమితులయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా షా ఫహద్ సయ్యద్‌కు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులకు ఒకేసారి జాతీయ స్థాయి పదవులు లభించడం జిల్లాకు గర్వకారణమని పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ పిల్లి గురు రాజా, షా ఫహద్ సయ్యద్‌లు తమపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ ఆశయాలను ప్రవాస భారతీయుల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ఎన్నారై విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అంకితభావంతో పనిచేస్తామని వారు తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలను పార్టీతో మరింత అనుసంధానం చేయడం, పార్టీ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

టీడీపీ ఎన్నారై విభాగం ద్వారా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రవాసాంధ్రుల సహకారాన్ని మరింత పెంచేందుకు ఈ కమిటీ కీలకంగా పనిచేస్తుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన నాయకులకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభించడం జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూర్చే పరిణామమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.