ఎస్‌ఐఆర్ ప్రక్రియకు మరో మూడు రోజులు..

ప్రతి ఓటరును గుర్తించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపు

టాప్-5లో గుడివాడ.. జూలై 14 అర్ధరాత్రి వరకు ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ

గుడివాడ, ఆంధ్రప్రభ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ముగియడానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రతి ఓటరును గుర్తించే పనిలో టీడీపీ బీఎల్ఏలు, పార్టీ యంత్రాంగం మరింత కృషి చేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు.

గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకుని అధికారులు, బీఎల్వోలతో పాటు పార్టీ యంత్రాంగం అంతా ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

గుడివాడలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ తరఫున ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ బీఎల్వోలకు టీడీపీ బీఎల్ఏలు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని చెప్పారు.

ఎన్నికల సమయంలో తమ వద్ద ఉన్న డేటాను కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో అనుసంధానించి మరింత సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు. మారుమూల గ్రామాల్లోని ప్రతి ఓటరును గుర్తించే పనిలో నిమగ్నమయ్యామని, ఇల్లు మారిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని కూడా గుర్తిస్తున్నామని తెలిపారు. పార్టీ యంత్రాంగం కృషి ఫలితంగా ఇప్పటికే ఎంతోమంది ఓటర్లను గుర్తించామని, మిగిలిన మూడు రోజుల్లో మరింత మందిని గుర్తిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రభుత్వం విస్తృతంగా అవగాహన కల్పిస్తోందని, ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అవగాహన లేని వారికి ఇరుగుపొరుగు వారు వివరించి ఫారాలు సమర్పించేలా సహకరించాలని కోరారు.

జూలై 14 అర్ధరాత్రి 12 గంటల వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద బీఎల్వోలు అందుబాటులో ఉంటారని, అవసరమైతే స్థానిక కూటమి నాయకత్వాన్ని కూడా సంప్రదించవచ్చని సూచించారు.

ఈ మూడు రోజులు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. అందరి కృషి ఫలితంగానే ఎస్‌ఐఆర్ ప్రక్రియలో గుడివాడ రాష్ట్రవ్యాప్తంగా టాప్-5 స్థానంలో నిలవడం గర్వకారణమని అన్నారు. టీడీపీ బీఎల్ఏలు, పార్టీ యంత్రాంగం సేకరించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వ బీఎల్వోలకు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.