పేదలకు కంటి వెలుగులు అందించడం గొప్ప సేవ
పేదలకు కంటి వెలుగులు అందించడం గొప్ప సేవ
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ల శిబిరం ప్రారంభం
మాతృభూమి రుణం తీర్చుకునేందుకు ముందుకొచ్చిన డాక్టర్ మాధవ్, డాక్టర్ అపర్ణ దంపతుల సేవలు అభినందనీయం
విజయవాడ, ఆంధ్రప్రభ : పేద ప్రజలకు కంటి వెలుగులు అందించడం గొప్ప మానవతా సేవ అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఐఏఎస్ అన్నారు. శంకర నేత్రాలయ హైదరాబాద్ ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా శాఖ సహకారంతో విజయవాడలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్ల శిబిరాన్ని సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ… కంటి చూపు కోల్పోయే పరిస్థితిలో ఉన్న పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపడం గొప్ప సేవా కార్యక్రమమని అన్నారు. ఆధునిక వైద్య సదుపాయాలను పేద ప్రజల వద్దకే తీసుకెళ్లే ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ తమ మాతృభూమిని మరువకుండా డాక్టర్ మాధవ్, డాక్టర్ అపర్ణ దంపతులు, సృజన పాలూరి ముందుకు వచ్చి పేదలకు కంటి చూపు అందించే కార్యక్రమానికి సహకరించడం ప్రశంసనీయమని కలెక్టర్ అన్నారు. తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సేవా భావంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు తమ జన్మభూమి కోసం ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని, మరింత మంది దాతలు ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. శంకర నేత్రాలయ వైద్య బృందం ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు అందించి, అర్హులైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నారు. ఈ శిబిరం జూన్ 15 నుంచి 21 వరకు విజయవాడలోని ఎస్ ఆర్ ఆర్ అండ్ సి వి ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి కొనసాగనుంది. అవసరమైన వారికి జూన్ 18 నుంచి 22 వరకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం మాట్లాడుతూ… మానవ సేవే లక్ష్యంగా రెడ్ క్రాస్ సంస్థ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. శంకర నేత్రాలయ వంటి ప్రముఖ వైద్య సంస్థ, సేవా దృక్పథం కలిగిన దాతల సహకారంతో పేదలకు కంటి వెలుగులు అందించడం ఎంతో సంతృప్తినిచ్చే కార్యక్రమమని తెలిపారు. రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ వెలగ జోషి మాట్లాడుతూ… శంకర నేత్రాలయ నాణ్యమైన కంటి వైద్య సేవలకు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, అలాంటి సంస్థ సేవలను పేద ప్రజలకు చేరువ చేయడం సంతోషకరమన్నారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం, వైస్ చైర్మన్ డాక్టర్ వెలగ జోషి, కార్యదర్శి ఇ.చిట్టిబాబు, కార్యవర్గ సభ్యులు ఎం.బలరాం, డాక్టర్ రమేష్, జయరాజు తదితరులు పాల్గొన్నారు. యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు శిబిర నిర్వహణలో సహకారం అందిస్తున్నారు.
