Bullet Train | బులెట్ ట్రైన్ హబ్‌గా తెలంగాణ
Bullet Train | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశంలో ప్రకటించిన ఏడు బులెట్ ట్రైన్ ప్రాజెక్టుల్లో మూడు తెలంగాణకు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ వల్లే ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికి లభించాయని పేర్కొన్నారు.
తెలంగాణ త్వరలోనే బులెట్ ట్రైన్ హబ్‌గా మారబోతోందని ఆయన అన్నారు. బులెట్ ట్రైన్ సేవలు ప్రారంభమైన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం గంటా 10 నిమిషాల్లో, ముంబైకి 2 గంటల 20 నిమిషాల్లో, చెన్నైకి రెండు గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
బులెట్ ట్రైన్ ప్రాజెక్టు దేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ ప్రాజెక్టు విజయానికి ప్రధాని నరేంద్ర మోదీకే పూర్తి క్రెడిట్ దక్కుతుందని, దానిని మరెవరూ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయొద్దని వ్యాఖ్యానించారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రైల్వే రంగంలో భారీగా నిధులు కేటాయించిందని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు యూపీఏ ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.800 కోట్లు మాత్రమే కేటాయించేదని, ప్రస్తుతం తెలంగాణకు రూ.5,000 కోట్ల వరకు నిధులు అందిస్తున్నామని వెల్లడించారు.
