మహిళ మెడలోని మంగళసూత్రం, కమ్మలు అపహరణ..
నిజామాబాద్ క్రైం, ఆంధ్రప్రభ: నిజామాబాద్ నగరంలో తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. టౌన్-3 పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు ఓ మహిళ మెడలోని మంగళసూత్రంతో పాటు చెవికమ్మలను అపహరించి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఘటన విషయం తెలుసుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ స్వయంగా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధితురాలిని పరామర్శించి, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి దర్యాప్తు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని వెంటనే పరిశీలించి నిందితులను గుర్తించాలని సీపీ ఆదేశించారు. నిందితులను త్వరితగతిన పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తును ముమ్మరం చేయాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, ఏసీపీ ప్రకాష్, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్-3 ఎస్ఐ హరిబాబు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
