SSC Memo | మీసేవలో డూప్లికేట్ పొంద‌వ‌చ్చు..

బోర్డు కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు..
మీసేవలో కొత్త సేవ ప్రారంభం
2004–2024 ఎస్సెస్సీ మెమోలకు అవకాశం..
ఒక్కో దరఖాస్తుకు రూ.62 రుసుము

SSC Memo |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పదో తరగతి (ఎస్సెస్సీ) మార్కుల మెమో లేదా ఉత్తీర్ణత ధ్రువపత్రం పోగొట్టుకున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై డూప్లికేట్ మెమో కోసం నేరుగా ఎస్సెస్సీ బోర్డు కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, సమీపంలోని మీసేవ కేంద్రం ద్వారానే సులభంగా దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రభుత్వం మీసేవ పోర్టల్‌లో ‘ఎస్సెస్సీ మెమో ఈ-కాపీ’ పేరుతో కొత్త సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా 2004 నుంచి 2024 వరకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు తమ డూప్లికేట్ మార్కుల మెమోను పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో దరఖాస్తుకు రూ.62 రుసుము నిర్ణయించారు.

డూప్లికేట్ మెమో కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన మిస్సింగ్ ఫిర్యాదు (ఎఫ్‌ఐఆర్/మిస్సింగ్ రిపోర్టు) ప్రతితో పాటు నోటరీ అఫిడవిట్ కూడా జత చేయాలి.

ఈ కొత్త సేవతో విద్యార్థులు బోర్డు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, సమీప మీసేవ కేంద్రంలోనే వేగంగా డూప్లికేట్ ఎస్సెస్సీ మెమో పొందే అవకాశం కలగనుంది. ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులకు సమయం, ఖర్చు ఆదా చేయడంతో పాటు సేవలను మరింత సులభతరం చేయనుంది.