Novak Djokovic | టెన్నిస్ దిగ్గజం జకోవిచ్
2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ లక్ష్యం..
25వ గ్రాండ్‌స్లామ్‌పై గురి
Novak Djokovic | ఆంధ్ర్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రపంచ టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ప్రస్తుతం తాను ఆటకు వీడ్కోలు చెప్పే ఆలోచనలో లేనని స్పష్టం చేశారు. శారీరకంగా పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉన్నానని, టెన్నిస్‌ను ఆస్వాదిస్తున్నంత కాలం కోర్టులో కొనసాగుతానని వెల్లడించారు.
తన లక్ష్యం 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ వరకు ఆడటమేనని జకోవిచ్ తెలిపారు. టెన్నిస్‌పై ఉన్న ప్రేమ, ఆటపై ఉన్న మక్కువే తనను ముందుకు నడిపిస్తున్నాయని, ఎవరి ఒత్తిడి వల్ల కాకుండా తన ఇష్టంతోనే కొనసాగుతున్నానని చెప్పారు. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన జకోవిచ్.. త్వరలో జరిగే యూఎస్ ఓపెన్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుని మరో చారిత్రక ఘనత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఇటీవల వింబుల్డన్ టోర్నీలో ఓటమి పాలైన అనంతరం స్పందించిన జకోవిచ్.. వచ్చే ఏడాది కూడా వింబుల్డన్‌లో బరిలోకి దిగాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. రిటైర్మెంట్ గురించి కాకుండా, మరిన్ని టైటిళ్లపై తన దృష్టి కేంద్రీకృతమైందని ఆయన వ్యాఖ్యానించాడు.
