గోదావరిఖని బస్టాండ్‌కు ఆధునిక హంగులు..

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్

గోదావరిఖని, ఆంధ్రప్రభ: గోదావరిఖని బస్టాండ్‌ను మరింత ఆధునికంగా తీర్చిదిద్ది ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించనున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక బస్టాండ్‌ను సందర్శించి జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు గోదావరిఖని బస్టాండ్‌ను వినియోగిస్తున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బస్టాండ్‌లో ఆధునిక ప్లాట్‌ఫారమ్‌లు, ప్రయాణికుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే బస్టాండ్ ఆవరణలో ప్రత్యేక ఆటో స్టాండ్‌తో పాటు ఆటో డ్రైవర్లకు అవసరమైన వసతులు కల్పిస్తామని తెలిపారు.

బస్టాండ్ పరిసరాల్లో ఫుట్‌పాత్‌లు నిర్మించి, పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రయాణికులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్‌ను అభివృద్ధి చేసి మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, సింగరేణి జీఎం డి. లలిత్ కుమార్, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, సంబంధిత శాఖల అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.