రూ.48 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం

గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: భూపాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూ.48 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గురువారం ప్రారంభించారు. పంబాపూర్‌లో రూ.9 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనం, గొల్లబుద్ధారంలో రూ.9 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, శ్యామ్‌నగర్‌లో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రహదారి, మొరంచపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రహదారిని ప్రజలకు అంకితం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా, రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేలా నాణ్యమైన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రతే రాష్ట్ర ప్రగతికి పునాదులని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా, నాణ్యతతో అమలు చేస్తున్నామని, ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.