గ్రామస్థులకు చేపల విక్రయం..

మత్స్య సహకార సంఘానికి అధికారుల నోటీసులు

మొగుళ్లపల్లి, ఆంధ్రప్రభ: మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చేపలను స్థానిక గ్రామాల్లో విక్రయించడం లేదంటూ పిడిసిల్ల గ్రామ సర్పంచ్ చేసిన ఫిర్యాదుపై జిల్లా మత్స్యశాఖ అధికారులు స్పందించారు. గురువారం జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ్‌కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ రాజు సంఘాన్ని సందర్శించి కార్యవర్గానికి నోటీసులు జారీ చేశారు. అనంతరం పిడిసిల్ల, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల చెరువులో చేపల వేట నిర్వహించి, సంఘం అధ్యక్షుడు సదయ్య సమక్షంలో గ్రామస్థులకు చేపలను విక్రయింపజేశారు.

ఈ సందర్భంగా ఇకపై పట్టే చేపల్లో కనీసం 50 శాతం చేపలను స్థానిక గ్రామ ప్రజలకు మార్కెట్ ధరకే విక్రయించాలని అధికారులు సంఘం కార్యవర్గాన్ని ఆదేశించారు. అధికారుల సూచనలను తప్పకుండా అమలు చేస్తూ గ్రామ ప్రజలకు చేపలను అందుబాటులో ఉంచుతామని సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి, డైరెక్టర్లు హామీ ఇచ్చారు.