ఆల్మట్టికి భారీ వ‌ర‌ద‌

1.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు జలకళ
మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి జలాశయానికి 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నిల్వలు క్రమంగా పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల్లోకి త్వరలో వరద నీరు చేరే అవకాశం

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల పశ్చిమ ఘాట్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో కర్ణాటకలోని కీలకమైన ఆల్మట్టి జలాశయానికి ప్రస్తుతం సుమారు 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.

ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 44.69 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారిక సమాచారం వెల్లడిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదే పరిస్థితి కొనసాగితే కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని తెలుగు రాష్ట్రాల ప్రధాన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు ఇతర ప్రాజెక్టులకు కూడా వరద నీరు చేరే అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీంతో సాగునీటి అవసరాలు, తాగునీటి నిల్వలకు గణనీయమైన ఊరట లభించే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి.