బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎరుకల గణపతి
భూపాలపల్లి నేతకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా భూపాలపల్లి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఎరుకల గణపతిని నియమించారు. హైదరాబాద్‌లోని ఘట్కేసర్లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు ఈ నియామకాన్ని ప్రకటించారు.
1999లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరిన గణపతి విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. విద్యార్థి సమస్యలపై పలు ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఆయన ఏబీవీపీ పట్టణ కార్యదర్శి నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి వరకు వివిధ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం బీజేపీలో చేరి బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ పార్టీ విస్తరణకు కృషి చేశారు.
భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించిన ఆయన వైస్‌చైర్మన్‌గా ఐదేళ్లపాటు సేవలందించారు. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్య మెరుగుదల, పేదల సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన పలు ఆందోళనల్లో పాల్గొని అరెస్టులు, జైలు జీవితం కూడా అనుభవించారు. రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పించిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్, ఈటల రాజేందర్‌తో పాటు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి గణపతి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మరింత బాధ్యతతో పనిచేస్తానని పేర్కొన్నారు.
