ఎన్యుమరేషన్ ఫారాలను జాగ్రత్తగా నింపాలి
మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి
మరిపెడ, ఆంధ్రప్రభ: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి వివరాలతో జాగ్రత్తగా నింపి సంబంధిత బీఎల్‌వోలకు తిరిగి అందించాలని మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి ఓటర్లకు సూచించారు. బుధవారం మరిపెడ మండలంలోని తాళ్లఊకల్ గ్రామంలో ఆమె పర్యటించి, ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను నింపుతున్న తీరును పరిశీలించారు.
అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తప్పెట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఓటర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, ప్రతి ఓటరు తన వివరాలను సక్రమంగా నమోదు చేసి, గడువులోగా ఫారాలను బీఎల్‌వోలకు అందజేయాలని కోరారు. ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి సమర్పించని పక్షంలో ఓటరు జాబితాలో పేరు కొనసాగడంపై ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఫారాల నింపడంలో ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత బీఎల్‌వోలను సంప్రదించాలని, నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తప్పెట్ల శ్రీనివాస్, ఉపసర్పంచ్ లింగయ్య, కొంపెల్లి సురేందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, తిరుపయ్య, ఎర్రమలయ్య, రోపయ్య తదితరులు పాల్గొన్నారు.
