నైపుణ్య విద్యతో మెరుగైన ఫలితాలు
- ఫిన్లాండ్ ట్రేైనర్ కమలాకర్
జన్నారం, ఆంధ్రప్రభ: ఒత్తిడి లేని నైపుణ్య విద్యతో మెరుగైన ఫలితాలు వస్తాయని ఫిన్లాండ్ లో శిక్షణ పొందిన(ట్రేనర్) ఉపాధ్యాయుడు దాముక కమలాకర్ తెలిపారు. హైదరాబాద్ లోని ఎస్సీఆర్టీ రాష్ట్ర కార్యాలయంలో ఫిన్లాండ్ విద్య వ్యవస్థ పై రాష్ట్రస్థాయి రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ రివ్యూ సమావేశానికి ఫిన్లాండ్ లో శిక్షణ పొంది వచ్చిన మండలంలోని అక్కపల్లి గూడ మండల పరిషత్ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్ తో కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు దాముక కమలాకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ.. అక్కడి విద్యా వ్యవస్థను వివరిస్తూ విద్యార్థులు చిన్ననాటి నుంచి ఒత్తిడి లేని విద్యను ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా ఉంటూ అకాడమిక్ విద్యాతో పాటు నైపుణ్య విద్యను నేర్పుతారన్నారు.ఉపాధ్యాయులపై పూర్తి నమ్మకాన్ని, విశ్వాసం కలిగి,1నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు ఉండవని ఆయన తెలిపారు.
ఉపాధ్యాయులే విద్యార్థుల సామర్ధ్యాలపరంగా గ్రేడును కేటాయిస్తారని, అక్కపెల్లిగూడ,కిష్టాపూర్ ప్రభుత్వ బడులల్లో ఆ విద్యా వ్యవస్థను అవలంబిస్తామని,ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు ఆయన చెప్పారు.ఆ ప్రభుత్వ బడుల ప్రణాళికను ఆయన వివరించారు. విద్యార్థులకు ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ అమలుపరుచుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఆయా ప్రభుత్వ బడుల్లో ఈ విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులు చేరినందుకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అభినందించారని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితరాన, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్,ఎస్సీఆర్టీ రాష్ట్ర డైరెక్టర్ రమేష్,ఫిన్లాండ్ వెళ్లి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
