ఎస్‌ఐఆర్ సర్వేకు రాజకీయ పార్టీల సహకారం అవసరం
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటరు సవరణ సర్వేను విజయవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆర్డీవో రాథోడ్ మోహన్ సింగ్ కోరారు. బుధవారం తన కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో ఎస్‌ఐఆర్ సర్వేపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలో మొత్తం 2,30,162 సర్వే ఫారాలను ఇంటింటికీ పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఇప్పటివరకు 27,435 ఫారాలను డిజిటల్ రూపంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎస్‌ఐఆర్ సర్వే ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్నందున, గడువులోపు 100 శాతం సర్వే పూర్తయ్యేలా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. సర్వే నిర్వహణ, ఫారాల సమర్పణ, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై పార్టీల నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. అధికారులు, బీఎల్‌వోలు, రాజకీయ నాయకులు, ప్రజలందరూ సమన్వయంతో పనిచేసి సర్వేను విజయవంతం చేయాలని ఆర్డీవో విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
