కుంటాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు

కుంటాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు

కుంటాల, ఆంధ్రప్రభ:
పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని తెలిపారు.కుంటాల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లలో సోమవారం గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర అధికారుల సమక్షంలో సర్పంచ్‌లు ఈ కార్యక్రమాలను చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

మహిళా సంఘాల ద్వారా రుణ సదుపాయాలు కల్పిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేర్లపై మంజూరు చేయడం ద్వారా కుటుంబ ఆస్తులపై మహిళలకు యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. రెండో విడతలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల గజేందర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జుట్టు అశోక్, హౌసింగ్ ఏఈ శైలజ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ లబ్ధిదారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply